శివధనుర్భంగము


శివధనుర్భంగము
శ్రీ విశ్వనాధ వారి కల్పవృక్షములో శివధనుర్భంగము
పెద్దకళ్ళేపల్లిలో శ్రీమద్రామయణకల్పవృక్షము పై ఒక సాహిత్య సభలో శ్రీ విశ్వనాధవారిని ఒక సభికుడు “స్వామి శివధనుర్భంగము మీద అంత పెద్ద సమాసాలతో పద్యం కాకుండా మావంటి వారికి కుడా అర్ధమయ్యేరీతిలో చిన్న పద్యం వ్రాసుండాల్సింది” అన్నాడుట. అందుకా కవిసామ్రాట్ ” ఏమయ్యా! సైకిల్ మీద స్పీడుగా పోతున్నప్పుడు ట్యూబ్ పగిలిన విషయాన్ని ఇంటికి వచ్చి నీభార్యకి చెప్పుతూంటే, ” స్పీడుగా పోతుంటే “ఢాం” అని ట్యూబ్ పేలింది అని గట్టిగా చెప్తావా? లేదా? మరి శివధనుర్భంగం జరిగినప్పుడు అన్ని లోకాలలో విన్నపడ్డ శబ్దానికైనా శబ్దాలంకారము వాడాలా వద్దా? అనే సరికి ఆ ఆసామి గతుక్కుమన్నాడుట.
ఇంతకీ ఆ ఆసామిని అంత గాభారా పెట్టిన పద్యాలను ఓ సారి తిలకించి, చదువుదాము.
మిత్రులు పిస్కా సత్యనారాయణ గారు ఆంద్రాఫోక్స్ లొ వ్రాసిన వ్యాసములో తాత్పర్య భాగములు
మొదటి పద్యము:
నిష్ఠావర్ష దుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికాయుగపదుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జథుషండ ఘుర్ఘుర రవాహీన క్రియాప్రౌఢి ద్రా
ఘిష్ఠమ్మై యొక రావ మంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్
“ఎడతెగకుండ వర్షించుచున్న అమోఘమైన మేఘముల సమూహము నుండి మిక్కిలిగా వచ్చు మెరుపుతీగలతో పాటు విజృంభించు పిడుగుల సమూహముల యొక్క ఘుర్ఘురధ్వనిని తక్కువ చేయునట్లుగా మిక్కిలి దీర్ఘమైన ఒక రావము ధనుస్సు నుండి వెలువడెను”
రెండవ పద్యము:
హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారియై, షణ్ముఖ
స్ఫార ద్వాదశనేత్రగోళ వివృతి ప్రాకారమై, శైలక
న్యారాజన్నవ ఫాలమండల విభుగ్నక్రీడమై, ఆశ్చల
ద్గీరుగ్ర ప్రమథంబుగా ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్
ఆ వింటిధ్వని వినాయకుని చేటలవంటి చెవితొఱ్ఱలకు సిగ్గును కలిగించినదట! గణేశుడు గజముఖుడు కదా! అందుకే ఆయనవి శూర్పకర్ణములు, అనగా చేటలవంటి విశాలమైన వీనులు! అటువంటి విశాల కర్ణములకే ఆ నాదము శ్రవణభీకరంగా ఉన్నదంటే, ఇక మామూలు మానవులకు ఎలా ఉండివుంటుంది!!…. ఇంకా ఏమంటున్నారో చూడండి. షణ్ముఖుడైన కుమారస్వామి విస్మయముతో తన 12 నేత్రములను విప్పార్చి చూచునట్లుగా చేసినదట ఆ రావము! కుమారస్వామి 6 శిరస్సులను కలిగినవాడు, అనగా 12 నయనములు! ఇకపోతే, గిరిరాజసుతయైన పార్వతీదేవి సైతం ఆ భయంకర నాదాన్ని విని, అప్రయత్నంగానే తన భ్రుకుటిని ముడివేసినదట! ఆమె అందమైన లలాటఫలకం ఆశ్చర్యముతో ముడివడిపోయినదట! ఇక, శివపార్వతులను సేవించే ప్రమథగణాలన్నీ ఆ భీకర విస్ఫోటన ధ్వనిని విని భయముతో “ఆఃప్రకట” రావము చేస్తూ అచేతనులు అయినారట!…. ఈవిధంగా “ధనువు మ్రోగెన్ శైవలోకంబులన్”.
శివధనుర్భంగము యొక్క పరిణామము కైలాసములో, కైలాసవాసులలో ఏ రకంగా ప్రతిఫలించినదో విశ్వనాథవారు ఈ పద్యములో ఎంతో హృద్యంగా వర్ణించారు. అది శివుని ధనుస్సు కాబట్టి, శివలోకమైన కైలాసములో కలిగిన అల్లకల్లోలమును వారు మన కళ్ళకు కట్టారు.