శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ( చందవోలు శాస్త్రి ) గారి అనుభవ విశేషాలు
ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు, మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు.
” తమకు నాగరలిపి వచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా ?” అని నేను అడిగాను.
” నాకు అక్షరాలు వస్తేనేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు” అన్నారు శ్రీవారు.
తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు స్వామివారు కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. అక్కడ పరిచారకుడు నేను వచ్చినట్లు స్వామికి తెలిపాడు. దొడ్లో గోశాలలో గోవుల మధ్య కూర్చుని ఉన్న శ్రీవారు నాకు కబురు పెట్టారు. నేను రాగానే శ్రీవారు పక్కనే ఉన్న ఒక పాడు బడ్డ కొంపలోకి వచ్చారు.
అదే సమయానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పి.వి. నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారి పై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకుని వచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు.
శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్ది కొన్ని సూచనలు చేశారు.
నా శ్లోకాలలో తప్పులేవి శ్రీవారు ఎత్తిచూపలేదు. కాని, నా కవిత్వంలో రెండు చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. అప్పుడే శ్రీవారు ” దేశంలో గొప్ప పదవి అలంకరించబోయే వ్యక్తి తప్పులు చేయరాదు” అని ఏదో సూచన ప్రాయంగా భవితను చెప్పారు.
నన్నుద్దేశ్యించి, ” కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు” అని శ్రీవారన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి, ఒక గంటసేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామి వారు ఈ క్రింది పద్యం చదివారు.
కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్ ల జ్జెనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం చనుమోదించుట బద్మినీపతి నిజుస్య స్మేర దృష్టి ప్రసా ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్, రామా! జగన్మోహనా!!
ఇది మా తండ్రిగారు వ్రాసిన ” రామ కధామృతము” లో బాలకాండ, నవమాశ్వాసములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం.
శ్రీవారు పై పద్యం చదివి, ” మీ నాన్నగారు దోవనబోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదూ ? ” అని నన్ను అడిగారు.
ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివే వారో అలాగే స్వామి వారు ఎట్లా చదవగలిగారు !
శ్రీవారు ఇప్పటి వారు కారు. వెనక ఆర్షయుగంలో వశిష్టాదుల కోవకు చెందిన వారు.
అనాచారం – ఆత్మహత్య
నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, కృష్ణలోనో, గోదావరి లోనో దూకి చచ్చిపోదామనే తలపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు.
ఒకసారి అరుగు మీద కూర్చోని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపు కెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే, శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్లున్నది ఆ రూపం.
చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరసగ రెండు రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది.
నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకుని, నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది.
ఐదారు నెలల తరువాత ఒకసారి మళ్ళా హైదరాబాదు వచ్చాను. తీర్ధయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడకు వస్తాను. లేకపోతే రాను. శ్రీ వేంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళినా శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్ధయాత్రే నాకు.
ఒకరోజు శ్రీ పి.వెంకటేశ్వర్లుతో ( శ్రీ పిరాట్ల వారు) కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. “చందోలు శాస్త్రిగారు” వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు.
నన్నుద్దేశ్యించి శ్రీవారు ” నీ సమస్య ఏమయింది?” అన్నారు.
నేను ” ఏం సమస్య? ”
శ్రీవారు : ” అనాచారం కోసం చావడం ”
నేను : ” వద్దు అని మీరన్నారు కదా ! అందుకని చాలించుకున్నాను”.
అటు తరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము నేను శ్రీవారు.
ప్రాయశ్చిత్త గ్రంధం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పుచేస్తే దిద్దుకునేందుకుగాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు.
స్వామివారు : ” అహం బ్రహ్మస్మి అనుకోరాదా? అనాచార భావం బాధించకుండా వుండేందుకుగాను.”
నేను: ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు
స్వామివారు: క్షణిక సమాధి సంగతి?
నేను: మీ అనుగ్రహం వుంటే వస్తుంది
ఆ తరువాత పక్కన ఒకాయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని తీసుకుని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాలువా తెప్పించి, స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు.
నేను: మీరు ఎవరిని తాకరు. మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు.
స్వామివారు : నీకు కాదు కప్పేది. నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను.
శ్రీవారికి నాతో పనిలేదు. నాకు శ్రీవారితో పనిలేదు. కాని కాసేపు వారితో ఉంటే సంగంలోనిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు.
” ఆయన ఋషి”
ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారిని గురించి ఒక చిన్న ఉదంతం ఇలా చెప్పారు.
” మా నాన్నగారు “త్రిశంకు స్వర్గం” అని పేరుగల ఏడంకాల నాటకం వ్రాశారు. దానిని నూజివీడు జమీందారు గారికి చదివి వినిపించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు తాను వ్రాసిన “విశ్వామిత్ర – మేనక” అనే మూడంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది.
” ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది? అని అడిగారు జమీందారు గారు.
” నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను?” అన్నారు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు.
“మరి చందవోలు శాస్త్రిగారో ?” అని అడిగారు జమీందారు గారు
” ఆయన ఋషి” అన్నారు చెళ్ళపిళ్ళవారు.
( ఈ వ్యాసము 13-5-90 ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధములో ప్రచురితమైనది )