ఆచార వ్యవహారాలు
మేము అపార్ట్మెంట్లొ ఉన్నప్పుడు మా ఫ్లోర్లో ఒకరి ఫ్లాట్లో మరణం సంభవించింది.
నా పొరుగువాడు వచ్చి ” సార్ ! మీరు కలగజేసుకుని ఆ శవాన్ని కిందకి మార్చి నీళ్ళు పొయ్యమని చెప్పండి.” అన్నాడు.
నేను : “అయ్యా ! మన మిత్రుల ఇంటిలో వారి ఆప్తులు పోయారు. మనం ఏదైనా సహాయం చెయ్యగలమో అని ఆలోచించండి.
మీరు దేనికి అనవసరంగా కంగారు పడుతున్నారు” అన్నాను.
పొ.వా : ” మీరు పెద్దవారని చెపుతున్నాను. ఆ నీళ్ళు అవీ మన గుమ్మాలలోకి వచ్చి తగలడతాయి. మీరు చెపితే వారు వింటారు కదా !”
నేను : ” వాళ్ళు ఎక్కడ వారి కార్యక్రమాలు చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీకు కూడా ఉండకూడదు”
పొ.వా: ” అదేమిటీ అలా మాట్లాడుతారు ! మీకు మడీ, ఆచారాలు ఉన్నాయిగా ! చెప్తారని…. అని నసిగాడు.
నేను : ” అది నిజమే. కానీ ఇక్కడ అది ముఖ్యం కాదు. ఆప్తులు పోయి బాధలో ఉన్నవారికి కాస్త మన వంతు సాయం చేసి స్వాంతన కలుగచేయాలి కానీ, ఇలా ఇబ్బంది పెట్టకూడదు.” అన్నాను.
పొరుగువాడు ” మీరు ఏప్పుడూ ఇలాగే మాట్లాడతారు” అని తనింట్లోకి వెళ్ళిపోయాడు.
నిజానికి ఇలాంటివి అపార్ట్మంట్లలో చాలా అభిప్రాయబేధాలు కలుగజేయవచ్చును.
ఈ సందర్భములో మన సినిమా “శంకరాభరణం” లో శంకర శాస్త్రి ద్వారా శ్రీ జంధ్యాల చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి.
“ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడానికి కాదు” అని కులం, దాని అడ్డుగోడలు గురించి ఎంత సున్నితం గా చెప్పారో ఆ మహానుభావుడు.