భారతమాతా కీ జై !!
మన సనాతన ధర్మ ప్రమాణ గ్రంథాలేమిటి?
విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేలకొలది ఉన్నవి. పుస్తకాలెట్లా అసంఖ్యాకాలుగా వున్నవో అట్లే మతాలూ బహుళంగా వున్నవి. ఏ మతస్థులకు ఆ మతగ్రంథాలు అతిగొప్పగా కనపడటం సహజం. ఎవరిమతాలు వారికి పరమావధి యని తోచటం న్యాయమే. మతాన్ని కాపాడుకొంటూ, జాగ్రత్తగా తమతమ ధర్మాలను పాటిస్తూ, మతగ్రంథాలకు సిక్కులవలె ఆలయాలు సహితం నిర్మించి, మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానీకాన్ని మనం చూడకపోలేదు.
మరి, మన ధర్మం సంగతియేమి? మన మతగ్రంథమేమిటి? మనకేదైనా పుస్తకమున్నదా? క్రైస్తవుని మతగ్రంథమేది అని అడిగితే నిస్సందేహంగా ‘బైబిలు’ అని బదులు చెపుతాడు. అదేవిధంగా మహమ్మదీయులకు మతగ్రంథం ‘ఖురాను’. వేదాలు పాటించే హిందువులమగు మనకు చెప్పుకోడానికి ఒక్కపుస్తకమయినా ఉన్నట్టు కనుపించదు. శైవులకు ‘తేవారం, తిరువాచికం’ ఉన్నవి. వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం. వారిలో భక్తిమార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం. వేదాలు వల్లించే ఘనాపాఠికి వేదాలే ప్రమాణం. ఇంగ్లీషు చదివి ఏదో కొంత వైదిక శ్రద్ధ ఉన్న వారికి గీతపై ప్రీతి. వీరందరూ హిందువులే. కాని వీరికి ఒక్క పుస్తకమనిలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతగ్రంథం.
ఇతర మతస్థులలో లౌకికజ్ఞానం కలగడానికి ముందే, బాల్యంలోనే అంతో ఇంతో మతప్రవేశం కల్గించడానికి పాటుపడతారు. అందుచే వారికి చిన్ననాడే మత సంస్కారాలుకల్గే అవకాశం ఏర్పడుతున్నది. కాని మనదారి వేరు. మనకు శైశవంలో లౌకికవిద్య ప్రధానం; పారమార్థికం అప్రధానం. ఈభావాలతో మన జీవితాలను చక్కదిద్దుకొన్నందువల్ల కలిగిన ప్రయోజనమేమి అని అడిగితే, ‘ఇతర మతాలలో జనం తగ్గినపుడల్లా మనమతంలోనుంచి వారికి కావలసినంతమందిని సరఫరాచేయడం’, ఇట్లాకాక బాల్యమాది మనమూ ఇతర మతస్థులవలె మతవిషయికమైన విజ్ఞానం మన బాలబాలికలకు అందుబాటులో ఉంచకల్గితే, ఇతర మతప్రసక్తికానీ, పరమత స్వీకరణకుకానీ ఎడముండదు. కానీ, వాస్తవవిషయంచూస్తే, మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి అరవైఏళ్ళకుగాని కలగటంలేదు. మన పుస్తకాలను మనమే దూషిస్తున్నపుడు, ఇతరులు వానిని తిరస్కరిస్తున్నారే యని శోచించటం అనవసరం.
మన ధర్మము లో చూడబోతే పుస్తకాలనుకాని, అందు చర్చించిన విషయాలకుగాని ఏ విధమైన కొరతయూ లేదు. అనుష్ఠించి, అనుభూతినొంది, ఐకాంతిక ఆనందనిష్ఠలో, ఆత్మానందంలో తేలినవారు ఒక్కరుకాదు, పలువురు. తాము తరించడమేకాక, తమ్ము దర్శించినవారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమందియో, వీరిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. అసాధారణమైన ఇట్టి అనుభూతికలవా రవతరించిన మనమతంలో ప్రమాణగ్రంథాలు లేకపోతాయా?
భావిక్షేమార్థం అనుషించేది ధర్మం. ఏ విధమైన ఆశాలేనివాడు చేసేధర్మం మోక్షకారకం. అదేధర్మం. అదేమతం. ఆధర్మాచరణకు ప్రమాణం అవసరం. వానిని చెప్పేగ్రంథాలే ధర్మప్రమాణాలు. ప్రమాణమంటే ఏమిటి? ప్రమాణమంటే సత్యం. ‘ఈధర్మమే సత్యం’ అని నిర్థారించేవే ధర్మ ప్రమాణాలు. ఈ ధర్మానికి పరాకాష్ఠ మోక్షం. ఆ మోక్షం ఇతరమతస్థులు చెప్పేవిధంగా పురలౌకికంగా – ఇహలోకసాధ్యం. దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి.
”అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః,
పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతా శ్చతుర్దశ.”
– మనుస్మృతి
”పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః,
వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ.”
– యాజ్ఞవల్క్య స్మృతి.
మన ప్రమాణగ్రంథాలు పదునాలుగు. సమస్తజ్ఞానమూ ఈపదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై యున్నందున వీనికి విద్యాస్థానాలని పేరు. అవి నాలుగువేదాలు. ఆరు అంగాలు. మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు. సూటియైన ధర్మప్రమాణం వేదం. షడంగాలు అనేవి-శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం.
”ఆధీతి బోధాచరణ ప్రచారణౖ
ర్దశా శ్చతస్రః ప్రణయ న్ను నాధిభిః,
చతుర్దశత్వం కృతవాన్ కుతః స్వయం
న వేద్మి విద్యాసు చతుర్డశస్వపి.”
– నైషధం 1 సర్గ.
నలుడు చతుర్దశ విద్యలకు (పదునాలుగు విద్యలకు) చతుర్దశల (నాలుగు దశలు) ఇచ్చాడట-చదవడం, చదివినది తెలిసికోవడం, చదివినరీతి ఆచరించడం. తాను ఆచరించడమే కాక ఇతరులకుసైతం బోధించడం – ఇవి చతుర్దశలు. చతుర్థశ విద్యలకూ, చతుర్దశలు చేసినవాడు నలుడు. చతుర్దశ విద్యలకు మరొకనాలుగు చేర్చిన అష్టాదశ విద్యలగును. ఆత్మావలోకనం కలుగజేసేవి ఈ విద్యలు. అన్నీ వీనియందణగి ఉన్నవి.